ఏపీ ఏలూరు జిల్లా గణపవరంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ తొలి విడత నగదు జమ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కరవు పరిస్థితులు లేవని సీఎం జగన్ అన్నారు.
వ్యవసాయం దండగ అన్న నాయకుడు.. నేడు రైతుల గురించి మాట్లాడున్నాడని ఎద్దేవా చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు
రైతులపై కాల్పులు జరిపించారన్నారు. రుణాల పేరుతో రైతులను మోసం చేసిన నాయకుడి పాలనను రైతులు ఒకసారి గుర్తుచేసుకోవాలని సీఎం జగన్ అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతన్నలకు రూ. 7 లక్షలు చెల్లిస్తున్నామని చెప్పారు. సీసీఆర్సీ కార్డు ఉన్న కౌలు రైతులకు కూడా రూ. 7 లక్షల పరిహారం అందజేస్తున్నామని తెలిపారు.
చంద్రబాబు దత్తపుత్రుడు రైతుల పరామర్శకు బయలుదేరారని జగన్ ఎద్దేవా చేశారు. పరిహారం అందని ఒక్క రైతుని కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడని విమర్శించారు. గత ప్రభుత్వంపై దత్తపుత్రుడు విపరీతమైన ప్రేమ చూపించాడని విమర్శించారు. అప్పుడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
పంట నష్టం జరిగిన రైతులకు ఇన్సురెన్స్ డబ్బులను సకాలంలో జమ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పంట పరిహారం అందజేసిన దాఖలాలు లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పంట సీజన్ ముగిసేలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు.
రైతన్నలకు ప్రతి అడుగులో తోడుగా ఉంటున్నామని తెలిపారు. రైతు బీమాను ప్రభుత్వం తరఫున చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని సీఎం జగన్ అన్నారు.
రైతుల ఖాతాల్లో రూ.5500 జమ:-
ఈ ఏడాది ఖరీఫ్ మొదలుకాక ముందే.. రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని సీఎం చెప్పారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం తప్పకుండా రైతు భరోసా అందిస్తున్నామన్నారు. రైతులకు ఏటా రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు.
మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుమన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు రైతులకు అందించామన్నారు. గత మూడేళ్లలో రైతులకు లక్షా 10 వేల కోట్లు ఆర్థికసాయం చేశామన్నారు. తొలి విడతలో రైతుల ఖాతాల్లో రూ.5,500 జమ చేస్తున్నామని తెలిపారు.