telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు బౌన్స్‌..బోరు మంటున్న బాధితులు

cm-relief-fund

అనారోగ్యం బారినపడిన వారి చికిత్స కోసం సామాన్యులు ఆశ్రయించే సీఎం రిలీఫ్ ఫండ్ లో నిధులు ఖాళీ అయ్యాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని పాణ్యం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జారీచేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్‌ ఫండ్‌) చెక్కు బౌన్స్ అయింది. బ్యాంకు ఖాతాలో తగినన్ని నిధులు లేవంటూ బ్యాంకు అధికారులు సంబంధిత వ్యక్తులను వెనక్కు తిప్పిపంపారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకరవర్గంలోని నాగిరెడ్డి కాలనీకి చెందిన గంగాధర్ రెడ్డి భార్య జ్యోతి ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. జ్యోతి పేరిట ఇచ్చిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును నిధులు లేవని బ్యాంక్‌ అధికారులు వెనక్కి ఇచ్చారు.

పాణ్యం రెవెన్యూ కాలనీకి చెందిన గంగాధర్‌రెడ్డి భార్య జ్యోతికి 2018 నవంబర్‌లో తీవ్ర కడుపు నొప్పి రావటంతో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ సదుపాయం లేకపోవడంతో అప్పు తెచ్చి ఆపరేషన్‌ చేయించారు. మొత్తంగా రూ.56 వేలు ఖర్చయ్యింది. సహాయం కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.26,920 మంజూరు చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చి 15న సమాచారం వచ్చింది. ఏప్రిల్‌ 9వ తేదీన ఏరాసు ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందించారు. 10వ తేదీన చెక్కును బ్యాంక్‌లో సమర్పించగా 15వ తేదీన ఆ పద్దులో నిధులు లేవని బ్యాంక్‌ అధికారులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. దీంతో బాధిత కుటుంభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts