telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వాసాలమర్రిలో ఇంటింటికెళ్లి పలకరించిన కేసీఆర్‌

సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించారు. 3 గంట‌ల్లో 60 ద‌ళిత కుటుంబాల‌ను సీఎం కేసీఆర్ పలుక‌రించారు. వాడ‌వాడ‌లా కాలిన‌డ‌క‌న సీఎం కేసీఆర్ తిరిగి.. 60 ఇండ్ల‌లోకి వెళ్లి వారి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాల‌నీలో శిధిలావస్తలో ఉన్న ఇళ్లను చూసి చ‌లించిపోయారు. ఇండ్లు లేని వారంద‌రికీ డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామ‌ని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ద‌ళిత బంధు ప‌థ‌కం గురించి తెలుసా అని సీఎం అడిగారు. ఇంటికి రూ. ప‌ది ల‌క్ష‌లు ఇస్తే ఏం చేస్తార‌ని ఆయన ప్ర‌శ్నించారు. ఈ రూ. 10 ల‌క్ష‌ల‌తో డెయిరీ ఫాం పెట్టుకుంటామ‌ని కొంద‌రు చెప్పాగా.. ట్రాక్ట‌ర్లు కొంటామ‌ని కొంద‌రు, వ్యాపారం చేసుకుంటామ‌ని మ‌రికొంద‌రు సీఎంకు చెప్పారు. ద‌ళిత బంధు డ‌బ్బును స‌క్ర‌మంగా ఉప‌యోగించుకోవాల‌ని సీఎం సూచించారు.

నిరుపేద మ‌హిళ‌లు, వృద్ధులు చెప్పిన స‌మ‌స్య‌ల‌ను కేసీఆర్ ఓర్పుగా విన్నారు. మ‌హిళ‌లు, వృద్ధుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అప్ప‌టిక‌ప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఆసరా పెన్ష‌న్ల‌పై ఆరా తీశారు. పెన్షన్ రానివాళ్ళు ఏవరైనా వుంటే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. పెన్ష‌న్ అంద‌డం లేద‌ని చెప్పిన 20 మంది బీడీ కార్మికుల‌కు రెండు రోజుల్లో పెన్ష‌న్ అందించాల‌ని ఆదేశించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్పబోతుండగా.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ల ఇంటిలో ఉండే చదువుకున్నా వాళ్ల కష్టాలు నాకు తెలుసమ్మా’’అని తెలిపారు.

కేసీఆర్‌ ఒక ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో పక్కనే వున్న ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా.. దళిత నాయకుడు.. పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు. ద‌ళిత బంధు ప‌థ‌కం ఉద్దేశాల‌ను వివ‌రించారు. ఎన్ని ప్ర‌భుత్వాలు వ‌చ్చినా ద‌య‌నీయంగా ఉన్న ద‌ళితుల ముఖాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ అనేక సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. వాసాల‌మ‌ర్రి ప‌ర్య‌ట‌న‌లో సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ వెంట ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత‌, మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తితో పాటు ప‌లువురు అధికారులు ఉన్నారు.

Related posts