రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులను నిర్దేశించారు. ఈ వర్షాల ప్రభావం హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నందున జిహెచ్ఎంసిలో పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ వర్షాల కారణంగా చెరువుల ఎఫ్.టి.ఎల్. పరిధిలో ఉన్న కాలనీల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. అపార్టుమెంట్ల సెల్లార్లలో కూడా నీరు రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగింది. హైదరాబాద్ నగరంలో 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయి. 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఎల్.బి. నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువుంది. హైదారాబాద్ నగరంలో 14 ఇండ్లు పూర్తిగా, 65 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిహెచ్ఎంసి, ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. 445 చోట్ల బిటి రోడ్లు, 6 చోట్ల నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయి. అన్ని చోట్ల రోడ్ల పునరుద్ధరణ జరుగుతున్నది.
హైదరాబాద్ నగరంలో 72 చోట్ల పునరావాస కేంద్రాలు ప్రారంభించి, ప్రభావిత ప్రజలకు తాత్కాలిక ఆవాసం, భోజనం కల్పించడం జరిగింది. ఇండ్లలో నీళ్లు చేరినందున రోజు దాదాపు లక్షా పది వేల మందికి భోజనం అందిస్తున్నాము.
జిహెచ్ఎంసితో పాటు రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం ఉంది. 238 కాలనీలు జలమయమయ్యాయి. 150 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.
ట్రాన్స్ కో పరిధిలో 9 సబ్ స్టేషన్లు, ఎస్.పి.డి.సి.ఎల్. పరిధిలో 15 సబ్ స్టేషన్లు, ఎన్పీడిసిఎల్ పరిధిలో 2 సబ్ స్టేషన్లలోకి నీళ్లు వచ్చాయి. అన్ని చోట్ల యుద్ధ ప్రాతిపదికన నీళ్లను తొలగించడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు, సెల్లార్లలో నీళ్లున్న అపార్టు మెంట్లకు విద్యుత్ సరఫరా తొలగించడం జరిగింది. నీళ్లు తొలగించే పనులు జరుగుతున్నాయి. నీళ్ల తొలగింపు పూర్తయిన చోటల్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతున్నది. చెట్లు, కొమ్మలు పడిపోయిన చోట్ల వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్దరణ జరిగింది. చాలా చోట్ల వరదల వల్ల, ముఖ్యంగా మూసీ నదీ వెంట ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు, కరెంటు పోళ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ శాఖ పరంగా దాదాపు 5 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా.
రాష్ట్ర వ్యాప్తంగా 101 చెరువు కట్టలు తెగాయి. 26 చెరువు కట్టలకు బుంగలు పడ్డాయి. జల వనరుల శాఖకు రూ.50 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా.
పంచాయతీ రాజ్ రోడ్లు 475 చోట్ల దెబ్బతిన్నాయి. 269 చోట్ల రోడ్లు తెగిపోయాయి. రూ.295 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా.
ఆర్ అండ్ బి రోడ్లు 113 చోట్ల దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బి పరిధిలో రూ.184 కోట్లు, నేషనల్ హైవేస్ పరిధిలో రూ.11 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా.
భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి సిఎం కేసీఆర్ లేఖ రాశారు. రైతులకు సహాయం అందించడానికి రూ.600 కోట్లు, జిహెచ్ఎంసితో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యల కోసం మరో రూ.750 కోట్లు సహాయం అందించాలని సిఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.
సోనాక్షి సిన్హాపై “శక్తిమాన్” కౌంటర్…!?