తెలంగాణ లో అనూహ్య భేటీ లు ప్రారంభం అయ్యాయి. తాజాగా, సీఎం కేసీఆర్, తన మేనల్లుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో వీరి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది.
కవిత ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాల తారుమారుపై చర్చించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 11 ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్, హరీశ్‌లు తొలిసారి భేటీ కావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన హరీశ్, పార్లమెంట్ ఎన్నికలపై మాత్రం ఆసక్తిని కనబరచలేదు. ఇదే టీఆర్ఎస్ ఫలితంపై దెబ్బ కొట్టిందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. నేపథ్యంలో హరీశ్‌తో కేసీఆర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.