telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కెసిఆర్ కీలక నిర్ణయం… ఇక తెలంగాణలో ప్లాస్టిక్ బంద్

Plastic

రాష్ట్రంలో ఇక ప్లాస్టిక్ పూర్తిగా కనుమరుగవనుంది. పర్యావరణానికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి సీఎం కేసీఆర్ సంకల్పించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తి, అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించే యోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ, అమలుపై జిల్లా కలెక్టర్లు, మంత్రులతో సీఎం కేసీఆర్ గురువారం (అక్టోబర్ 10) ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యావరణంపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించనున్నట్లు వెల్లడించారు. పారిశుద్ధ్యం నిర్వహణలో కేంద్రం నుంచి అవార్డులు అందుకున్న జిల్లా కలెక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లను ముఖ్యమంత్రి అభినందించారు. వాడి పడేసిన ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి చాలా ఏళ్లు పడుతోంది. పర్యావరణానికి ఇది పెను ముప్పుగా మారింది. దేశంలోని నదులు, సముద్ర తీర ప్రాంతాలన్నీ ప్లాస్టిక్‌తో నిండిపోతున్నాయి. జలచరాలు, వన్యప్రాణులకు కూడా ప్లాస్టిక్ ప్రాణాంతకంగా పరిణమించింది. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లతో హైదరాబాద్ నాలాలు మూసుకుపోతున్నాయి. దీంతో వర్షం కురిస్తే నాలాలు రోడ్లపై పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ నిషేధంపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది.

Related posts