telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈ నెల 24, 25 నుంచి రైతు ఉద్యమం.. -కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు.  ఈ నెల 24, 25 వ తేదీ నుంచి తెలంగాణలో రైతు ఉద్యమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లపై కార్యచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌లు కీల‌క విష‌యాల‌పై కేసీఆర్ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం సాగాలని నిర్ణ‌యించారు. రాష్ట్రంలో రైతులందరినీ కలుపుకోని ఉద్యమించాలని చెప్పారు. కేవలం పార్టీ కార్యకర్తలే కాదు.. అంతా కలిసి పోరాటం చేయాలని అన్నారు. 

TRSLP Meeting 2022

మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణకు కూడా ఫుడ్ బిల్ తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ భేటీలో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో, పార్టీ  జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.దాదాపు 300 మందికి పైగా పార్టీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి పార్టీ శ్రేణులతో తొలి దఫా సమావేశం ముగిసింది. ప్రస్తుతం భోజన విరామం తీసుకున్నారు. భోజన విరామం అనంతరం మరోసారి పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.

ఈ భేటీ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల బృందం దిల్లీకి వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి డిమాండ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. పంజాబ్ తరహాలో రాష్ట్రంలోనూ పూర్తి ధాన్యం కొనాలని కేంద్ర సర్కార్‌ను మంత్రులు కోరనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై తెరాస మరోసారి ఉద్ధృత పోరాటానికి సిద్ధమవుతోంది.

Related posts