telugu navyamedia
తెలంగాణ వార్తలు

సిట్టింగ్ లకే మళ్లీ సీట్లు..ఎమ్మెల్యే టికెట్లపై సీఎం కేసీఆర్ క్లారిటీ

*ఎమ్మెల్యే టికెట్లపై సీఎం కేసీఆర్ క్లారిటీ
*ఎన్నికలు ఇప్పుడొచ్చినా 90 సీట్లు మనవే
*మునుగోడులో టీఆర్ఎస్ దే గెలుపు..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మనకు 90 సీట్లు పక్కా అని తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు ఈసారి కూడా గెలుపు తమదేనని ఆశాభావం వ్య‌క్తం చేశారు.ప్రజలతో, పార్టీ క్యాడర్‌తో మమేకమయ్యేవారికి ఎప్పుడూ ఢోకా ఉండదని అన్నారు.

శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడులో గెలిచేది వంద శాతం మనమే. ఇందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు’ అని పార్టీ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. అయితే ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులను మునుగోడులోని రెండేసి గ్రామాలకు పంపి, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించినట్టు సమాచారం.

తెలంగాణలో బీజేపీ మనల్ని ఏమీ చేయలేదని కేసీఆర్ అన్నారు. సీబీఐ, ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తుందన్నారు. మునుగోడులో 41 శాతం టీఆర్ఎస్ కు ఓట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ కు రెండో స్థానం, బీజేపీకి మూడో స్థానం దక్కుతుందన్నారు.

ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఇక్కడ నడవదని కేసీఆర్ అన్నారు. శివసేనను టార్గెట్ చేసినట్లు టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు.

మునుగోడులో టీఆర్ఎస్ దే గెలుపని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జులుగా నియమిస్తానని చెప్పారు.

మనం గతంలోనూ పెద్దగా మార్చుకోలేదు. మార్చటం నాకు ఇష్టం ఉండదు. అలాగనిఇలానే ఉంటామంటే కుదరదు. ఏం చేసినా సరే అంటే కూడా చెల్లదు కదా! తప్పదంటే ఓ నాలుగైదు మార్చాల్సి వస్తదేమో.. ఈ టైంల అన్నీ సరిచేసుకోవాలి. జాగ్రత్తగా నడుచుకోవాలి’ అని ఆయన ప్రజాప్రతినిధులకు చెప్పినట్టు తెలిసింది.

మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పార్టీ క్యాడర్‌తో నిత్యం సత్సంబంధాలు కొనసాగించాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారని సమాచారం.

మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ విధానమని, అయితే ఆ విషయాలను ఎక్కువ ఆలోచించకుండా విశాల ప్రజాప్రయోజనాల కోసం పనిచేస్తున్నామనే స్పృహతో వ్యవహరించాలని చెప్పారు.

ఒక్కొక్క ఎమ్మెల్యేకు రెండు గ్రామాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం ఉన్నంత కాలం మనకు తిరుగుండదని చెప్పారు.

ప్రతి ఎమ్మెల్యేకు తమ నియోజకర్గ భౌగోళిక, సామాజిక స్వరూపంపై, ఎంతమందికి సంక్షేమ పథకాలు అందాయనే అంశంపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి మనసుల్లో ‘మనం మాత్రమే’ చేయగలిగాం అని ముద్రపడేలా ఒకటికి పదిసార్లు చెప్పాలని కేసీఆర్‌ పేర్కొన్నట్టు సమాచారం

Related posts