పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది.దీంతో అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు స్పీకర్ రద్దు చేశారు.
అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..సాధారణ మరణాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం మరణాలు గతంలో కూడా అనేక సార్లు జరిగాయన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు హయాంలో నాటుసారా తయారీ విచ్చలవిడిగా జరిగిందన్నారు. కానీ ఇప్పడు అక్కడక్కడ జరుగుతోందని, కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
బెల్డ్ షాపులను ఇప్పడు పూర్తిగా ఎత్తేశామని, లాభాపేక్షతో గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపిందన్నారు. గతంలో గుడి, బడి ప్రాంతాల్లోనూ మద్యం అమ్మకాలు జరిగాయని ఆయన ఆరోపించారు.
సహజ మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటాయని, దేశంలో ఎక్కడైనా 90 శాతం సహజ మరణాలే ఉంటాయని ఆయన అన్నారు. అన్ని మరణాలు ఒకే చోట జరిగినవి కాదని.. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.