telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏలూరు : బాధితుల వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా…

cm jagan

ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలోని పది ప్రాంతాలకు చెందిన వారు… స్పృహ కోల్పోవడం, మెడ, నడుం నొప్పి, తల కళ్లు తిరగడం లాంటి లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు ఆస్పత్రులకు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే బాధితుల సంఖ్య కాస్త 450 దాటింది. అయితే…ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి నిర్వహిస్తున్న పరీక్షలపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరా తీశారు. ఇప్పటివరకూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అస్వస్థతకు గురైనవారికి ఎయిమ్స్‌ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన పరీక్షల్లో సీసం, నికెల్‌ లాంటి మూలకాలు ఉన్నట్టుగా తెలుస్తోందని మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఐఐసీటీ కూడా పరీక్షలు చేస్తోందని ఆ వివరాలు కూడా త్వరగా వస్తాయని వెల్లడించారు. బాధితులకు నిర్వహించిన పరీక్షలు, అలాగే ఆప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షలు.. వీటన్నింటి ఫలితాలను ఓ నివేదిక రూపంలో పొందుపరచి తనకు ఇవ్వాలని, దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌కూడా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాల ప్రకారం సీసం లాంటి మూలకాలు ఎలా ఆ ప్రాంత ప్రజల శరీరాల్లోకి చేరాయో, దానికి తగ్గ కారణాలను పూర్తిస్థాయిలో పరిశోధించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య సిబ్బంది, విభాగాలు నిశిత పరిశీలన చేయాలని, అస్వస్థతకు దారితీసిన కారణాలు, మార్గాలను గుర్తించాలని ఆదేశించారు. బాధితులకు కొనసాగుతున్న వైద్య చికిత్స, వారికి అందుతున్న సదుపాయాలపై కూడా సీఎం అధికారులతో సమీక్షించారు.

 

Related posts