కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు కాసేపటి క్రితం ముగిశాయి. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో కోట్లాది మంది అభిమానులు.. కుటుంబసభ్యులు.. సన్నిహితుల రాజకీయ, సినీ ప్రముఖుల మధ్య ప్రభుత్వ లాంఛానాలతో పునీత్‌కు కడసారి వీడ్కోలు తెలిపారు. కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, యడియూరప్ప, సిద్ధరామయ్య, నటులు యశ్, సుదీప్, తదితరులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
అంత్యక్రియలు ప్రారంభమైన సమయంలో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై.. పునీత్ పార్థివదేహానికి సెల్యూట్ చేశారు. అనంతరం…పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి, ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు అలా నిల్చుండిపోయారు.
మరోసారి తల నిమురుతూ తీవ్ర భావేద్వోగానికి లోనయ్యారు. పునీత్ నుదిటిపై సీఎం బొమ్మై ముద్దుపెట్టిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పునీత్ అంటే బొమ్మైకి ఎంత అభిమానమో ఈ సీన్ చూస్తే అర్ధమవుతుంది. కోట్లాది మంది అభిమానుల్ని సోకసంద్రంలో ముంచేసి పునీత్ సెలవుతీసుకున్నారు.
శుక్రవారం(అక్టోబర్ 29) ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే పలు భాషలకు చెందిన నటీనటులు.. సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ హఠాన్మరణం చాలామంది అభిమానులు షాక్‌కు గురిచేసింది.ఈయన మృతిని తట్టుకోలేక కర్ణాటకకు చెందిన ఆరుగురు ఫ్యాన్స్ మరణించగా, మరో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మరో అభిమానికి గుండెపోటు రావడం వల్ల అతడిని ఆస్పత్రిలో చేర్చారు.