telugu navyamedia
తెలంగాణ వార్తలు

వచ్చే ఏడాది ఖైరతాబాద్‌లో 70 అడుగుల ‘మట్టి గణపతి’

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ ప్రథమ పౌరురాలు గద్వాల్‌ విజయలక్ష్మి విజ్ఞప్తి మేరకు వచ్చే సంవత్సరం మట్టి గణపతిని ప్రతిష్టించేందుకు నిర్వాహకులు అంగీకరించారని మేయర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

మంగళవారం ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకున్న విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మట్టి గణపతి ఏర్పాటుపై ఉత్సవ కమిటీ ప్రతినిధులతో చర్చించారు. పర్యావరణం, నిమజ్జనంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఏకో ఫ్రెండ్లీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు.

ఆమె విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించినట్టు మేయర్‌ కార్యాలయం తెలిపింది. వచ్చే ఏడాది ఖైరతాబాద్‌లో 70 అడుగుల మట్టి గణపతి ప్రతిష్టించి మండపంలోనే నిమజ్జనం చేయాలనే ఆలోచన ఉందని చైర్మన్‌ సింగారి సుదర్శన్ తెలిపారు.

Related posts