telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్..

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు సీఐడీ కోర్టు రాత్రి బెయిల్ మంజూరుచేసింది. దీంతో శుక్రవారం అర్ధ‌రాత్రి అశోక్ బాబు విడుదల య్యారు. రూ.20 వేల పూచికత్తుతో కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారంటూ అశోక్‌ బాబు పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఓ వివాహ వేడుకకు హాజరై గురువారం రాత్రి 11.30కు ఇంటికి చేరుకున్న అశోక్ బాబును మఫ్టీలో వేచి చూస్తున్న పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తీసుకెళ్లారు.

శుక్రవారం రాత్రి 7 గంటల వరకు దాదాపు 18 గంటలు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు.

రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అరెస్ట్‌ చేశారని,ఇటీవలే అశోక్‌బాబు గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారని.. అందువల్ల ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. అశోక్‌బాబుపై నమోదు చేసిన కేసులో పేర్కొన్న సెక్షనన్నీ బెయిల్‌కు అర్హమైనవేనని ఆయన తరపున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

బెయిల్‌ మంజూరు చేయకుండా రిమాండ్‌ విధించాలని సీఐడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చైతన్య కోరారు. ఉద్యోగంలో ఉండగా పదోన్నతి కోసం తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. 467 సెక్షన్‌ పెట్టినందున రిమాండ్‌కు పంపాలని విన్నవించారు.

ఇరువైపు వాదనలు విన్న సీఐడీ న్యాయమూర్తి..సుదీర్ఘ విచారణల అనంతరం ఆయనకు 20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ లభించింది. శుక్రవారం రాత్రి కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి జస్టిస్ సత్యవతి అశోక్ బాబుకు బెయిల్ మంజూరు చేశారు.

కాగా..శుక్రవారం అర్ధరాత్రి అశోక్ బాబు విడుదల అయిన నేప‌థ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేతల పట్టాభి రామ్ సహ పలువురు నేతలు ఎమ్మెల్సీని పరామర్శించారు. అప్రజాస్వామికంగా ఉద్దేశపూర్వకంగానే అశోక్ బాబును అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.

మ‌రోవైపు..అశోక్‌బాబును అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పీఆర్సీని వ్యతిరేకించిన ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడినందుకే అశోక్‌బాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని విమర్శలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

 

Related posts