telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చాక్లెట్ వినాయకుడు .. పంజాబ్ వెరైటీ .. నిమజ్జనం నోట్లోనే..

chocolate ganesh in punjab

దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు చక్కగా జరుగుతున్నాయి. మొదటి రోజు నుండి వీధివీధినా, వాడవాడలా మండపాలలో గణేశుడు పూజలు అందుకుంటున్నాడు. అయితే ప్రతిసారి ఈ మండపాలలో రకరకాల గణపతి మూర్తులను తయారుచేసి, వాటిని పూజిస్తుండటం ఆనవాయితీ. అందుకే ఒక్క గణేషునికే ఈ నవరాత్రులలో అనేక రూపాలు, భక్తులు కూడా వాటిని ఆసక్తిగా దర్శించుకొని వారివారి మొరలను చెప్పుకుంటారు. కుటుంబమంతా కలిసి కూర్చుని పూజ చేసుకునే అవకాశం ఈ పండుగ ప్రత్యేకత. బొజ్జ గణపయ్యకు పూజ చేస్తుంటే మనసు పులకిస్తుంది. వినాయకుడిని ఎన్ని విధాలుగా అలంకరించుకున్నా ఇంకెంత కొత్తగా చేయాలంటూ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అందుకే ఏటికేడు ఎక్కడో ఒక చోట తమ క్రియేటివిటీకి పదును పెట్టి వినాయకుడిని అనేక రూపాల్లో తయారు చేస్తూంటారు. పంజాబ్ లోని లూథియానాలో ఇలానే ఆలోచించిన ఓ బేకరీ యజమాని చాక్లెట్ వినాయకుడిని తయారు చేశాడు.

లూథియానాకు చెందిన హర్జీందర్ సింగ్ అనే ఓ బేకరీ యజమాని వినాయకచవితి పండుగను వినూత్నంగా ఆలోచించి జరుపుకుంటున్నాడు. తన ఆలోచనలను పదును పెట్టి వినాయకుడిని బెల్జియం చాక్లెట్ క్రీమ్స్ తో తయారు చేయించాడు. హర్జీందర్ నాలుగేళ్లుగా ఇదే పద్ధతిలో వినాయక ప్రతిమలను తయారు చేసి పండుగ జరుపుకుంటున్నాడట. ఈ ఏడాది కూడా వంద కిలోల బెల్జియం చాక్లెట్ క్రీమ్ తో వినాయకుడిని తయారు చేయించాడు. ఈ వినాయకుడిని నిమజ్జనం చేసే రోజున పాలలో ముంచి నిమజ్జనం చేస్తాడట. ఈ పదార్ధాలతో మిల్స్ షేక్స్ తయారు చేయించి పేద పిల్లలకు వడ్డిస్తూ వినాయకచవితి పండుగను జరుపుకుంటాడు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా పిల్లలకు ఈ మిల్క్ షేక్ ను అందిస్తానని అంటున్నాడు. ప్రతి ఏటా ఈ విధంగా పండుగ చేసుకోవడం తనకు అమితానందాన్నిస్తోందని అంటున్నాడు. ఈ ఉండ్రాళ్లయ్యను తయారు చేయడానికి ఇరవై మంది షెఫ్ లు, పది రోజులపాటు శ్రమించారని హర్జీందర్ అన్నాడు. ఈ వినాయకుడు చూడటానికి కూడ చాలా ముచ్చటగా ఉన్నాడు. చాక్లెట్ క్రీమ్ తో తయారుచేసిన వినాయకుడు చూడటానికి చాక్లెట్ బాయ్ లానే ఉండి ఆకర్షిస్తున్నాడు. మంచి ఐడియాతో పండుగ జరుపుకుంటున్న హర్జీందర్ ను అభినందించాల్సిందే.

Related posts