telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీ కృషికి చేతులెత్తి నమస్కరిస్తున్నా… ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలపై మెగాస్టార్ వీడియో

chiru

ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు విజయవంతం కావాలని కోరుకుంటూ చిరంజీవి ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు. జులై 24 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం పట్ల స్పందిస్తూ.. “‘ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన, బలపడిన తెలుగువారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా మీరందరూ ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ… తెలుగు భాష, తెలుగు సంస్కృతి, సంప్రదాయ ఔన్నత్యం పట్ల మీరు చూపుతున్న అభిమానానికి నా అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక మంది మాట్లాడే భాషగా తెలుగు 15వ స్థానంలో, ఇండియాలో చూసుకుంటే హిందీ, బెంగాలీ తర్వాత మూడో స్థానంలో, అలాగే ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమెరికాలో హిందీ, గుజరాతీ తర్వాత మూడో స్థానంలో వెలుగొందుతోంది మన తెలుగు. ఇలాంటి తెలుగు భాష, సంప్రదాయ పరిరక్షణ కోసం తానా ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల్లోని తెలుగు సంస్థలు ఒకే తాటిపైకి వచ్చి… జూలై 24 నుంచి 26వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరం. ప్రాచీన హోదాను దక్కించుకున్న తెలుగు భాష సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి భాషా సాంస్కృతిక సమ్మేళనాలు చాలా అవసరం. దేశ భాషలందు తెలుగు లెస్స.. ప్రపంచంలో ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రశంసలు అందుకున్న భాష మనది. ఈ కరోనా కష్ట కాలంలో కూడా తెలుగు సంప్రదాయ విలువలను ముందు తరాల వారికి అందించేందుకు మీరు చేస్తున్న కృషికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ మూడు రోజుల కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆశిస్తున్నా” అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలను పురస్కరించుకుని ఎన్నోదేశాలలో ఉంటున్న తెలుగువారి టాలెంట్‌ను వెలికితీసి, వారి మధ్య పోటీలను నిర్వహిస్తారు. కాగా, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఈ పోటీలను జరపుతున్నారు.

Related posts