బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.
అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ ఆదివారం (జులై 24) గ్రాండ్‌గా జరిగింది. ‘లాల్‌సింగ్ చద్దా’ తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితోపాటు అమీర్ ఖాన్, నాగ చైతన్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 2019 నుంచే అమిర్ నాకు ఈ సినిమా గురించి చెబుతూ వచ్చారు. మేం మొన్న లాల్ సింగ్ చడ్డా చూశాక ఎవ్వరికీ కొద్ది సేపు మాటలు రాలేదు. వీళ్ళు స్పందించడం లేదేమిటని అమిర్‌ఖాన్ అనుకుంటున్నాడు కానీ..మేమంతా భావోద్వేగానికి గురయ్యామని చిరంజీవి తెలిపారు.
అమీర్ ఖాన్ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గొప్ప నటుడు అనిపించుకున్నాడు. అమీర్ ఖాన్ నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టం. అమీర్ ఖాన్‌లాగా మేం చేయాలనుకుంటాం.. కానీ మాకున్న పరిధుల వల్ల చేయలేకపోతున్నామని అన్నారు.
అమీర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయనపై ఉన్న ప్రేమ, బాధ్యతతో ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నా. నేను తొందరపడి ఈ సినిమా ఒప్పుకోలేదు. గర్వపడి విడుదల చేస్తున్నా అని చిరంజీవి తెలిపారు.