షాంఘైలోని ఝు జియాడోంగ్ అనే 30 ఏళ్ళ వ్యక్తి తన భార్య యాంగ్ లిపింగ్‌ను దారుణంగా హతమార్చి మృతదేహాన్ని డీప్ ఫ్రీజర్‌లో 100 రోజులకు పైగా దాచి పెట్టిన ఘటన చోటు చేసుకుంది. హంగ్‌కౌలో నివాసముండే ఝు, యాంగ్ భార్యాభర్తలు. ఝు క్లాత్ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తుంటే, యాంగ్ ప్రైమరీ స్కూల్ టీచర్‌గా విధులు నిర్వహించేది. దంపతులిద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. అయితే 2016, అక్టోబర్ 17న వారి మధ్య ఓ విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో కోపోద్రిక్తుడైన ఝు భార్య యాంగ్‌ను గొంతునులిమి చంపేశాడు. అనంతరం భార్య శవాన్ని ఆన్‌లైన్‌లో ఫ్రీజర్ తెప్పించి దాంట్లో సుమారు 106 రోజులు దాచి పెట్టాడు. విషయం బయటపడకుండా ఉండేందుకు యాంగ్ మెయిల్ ఓపెన్ చేసి ఆమె పేరెంట్స్, స్నేహితుల నుంచి వచ్చే సందేశాలకు రిప్లై ఇస్తూ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో యాంగ్ లిపింగ్ తండ్రి బర్త్‌డే ఉండడంతో దంపతులను ఇంటికి ఆహ్వానించారు. కానీ, వారు వెళ్లలేదు. దీంతో తన బండారం బయటపడుతుందని భావించిన ఝు ఫిబ్రవరి 1న పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల విచారణలో తన భార్యను హత్యచేసిన తరువాత వేరే మహిళతో కలిసి హైనాన్ ప్రొవిన్స్, జియాంగ్సు ప్రావిన్స్‌లోని నాన్జింగ్, క్సూసూ నగరాలతో పాటు సౌత్ కొరియాకు వెళ్లివచ్చినట్టు, ఆమె క్రెడిట్ కార్డుల నుంచి సుమారు 15 లక్షల వరకు ఖర్చు చేసినట్టు వెల్లడించాడు. షాంఘై నెం 2 ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు గత ఆగస్టులోనే ఝుకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ షాంఘై హయ్యర్ పీపుల్స్ కోర్టును ఆశ్రయించాడు ఝు. వాదోపవాదాలు విన్న షాంఘై న్యాయస్థానం ఝుకు మరణ శిక్షనే ఖరారు చేసింది.
previous post
next post
బికినీలో అనుష్క శర్మ… కోహ్లీ రియాక్షన్…!