తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్ కేసు పై ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప స్పందించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ఎక్కడా లీక కాలేదని మంత్రి స్పష్టం చేశారు. కేవలం పార్టీల సమాచారం మాత్రమే లీకైందని తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన డేటా పోయిందని ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. కానీ జరగని తప్పుని జరిగినట్లుగా నిరూపించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారంపై సిట్ వేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. ఈ విషయంలో నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. ఫారం-7 ఎవరైనా ఇవ్వొచ్చన్నారు. విచారణ చేసి ఎన్నికల సంఘం తొలగిస్తుందని చెప్పారు. ఓట్లు తీసేయమని మేమే దరఖాస్తు చేశామని జగన్, వాసిరెడ్డి పద్మ చెప్పిన సంగతి చినరాజప్ప గుర్తు చేశారు. తెలంగాణలో కూడా గత శాసనసభ ఎన్నికల్లో 25లక్షల ఓట్లు తొలగించి ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు.