టీ.ఎన్. శేషన్ఎ లక్షన్ కమీషనర్ గా వుండగా ఓసారి హైదరాబాదు వచ్చారు. రాజ భవన్ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం.అనగానే అందరం బిలబిలా వెళ్లాం. ఎలక్షన్ కమిషనర్ హోదాలో అది ఆయన మొదటి సమావేశం. ఆయన గురించి వినడమే కాని వ్యవహార శైలి ఎవరికీ పరిచయం లేదు. అప్పటికే గది నిండి పోయింది. ఇంతలో ఆయన వచ్చారు. ఫోటోలు తీసుకోవడానికి ప్రెస్ ఫోటోగ్రాఫర్లు అక్కడి సోఫాలపైకి ఎక్కారు. ఇది మామూలే. ఫోటో సరైన యాంగిల్ లో తీసుకోవడానికి వారు ఇలాంటి ఫీట్లు చేస్తుంటారు. కానీ వచ్చిన వాడు శేషన్ మరి. ఆయన కన్నెర్ర చేశారు . అందర్నీ సోఫాల నుంచి కిందికి దిగమని గట్టిగా చెప్పారు. వినక పొతే భద్రతా సిబ్బందికి పని చెబుతా అని హెచ్చరించారు.
అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఫొటోగ్రాఫర్లు ఇలాటి మాటలు గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరగనివి.
అయితే అదే శేషన్ ను అదే గెస్ట్ హౌస్ లో అదే రోజు మరో మారు కల్సుకోవాల్సిన సందర్భం పడింది. ప్రెస్ క్లబ్ తరపున ఏదో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించాలని సంకల్పం. అంతకు ముందు ఓసారి ఆయన్ని ఇదే పని మీద ఢిల్లీలో ఆయన అధికార నివాసంలో కలుసుకున్నాము.
మిత్రులు జ్వాలా నరసింహారావు, ములుగు సోమశేఖర్ పూనికపై డెక్కన్ క్రానికల్ ఢిల్లీ కరస్పాండెంట్ రాధ, ఆనంద్ కుమార్ గారి మాట సాయంతో క్లబ్ కార్యదర్శి శంకర్, నేనూ, జ్వాలా, సోమశేఖర్ కలిసి రాధ గారిని వెంటపెట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళాము. అప్పటికే ఒకటి రెండు సార్లు జ్వాలా ఆయనతో ఫోనులో మాట్లాడ్డం, మెయిల్ సందేశాలు పంపడం జరిగినట్టుంది, తలుపు తీస్తూనే ‘Who is Jwala, Why no flames are coming’ అంటూ ఆప్యాయంగా పలకరించారు.
భద్రత బాగా వున్నా ఇల్లు చాలా సింపుల్ గా వుంది. నౌకర్లు, చాకర్లు ఎవరూ లేరు. శేషన్ గారి భార్య జయలక్ష్మి గారే స్వయంగా కాఫీ కలుపుకు వచ్చి సర్వ్ చేశారు . జ్వాలా ‘కాఫీ తాగను’ అంటే ‘ఒక్క క్షణం వుండండి’ అంటూ వెళ్లి బోర్నవిటా తెచ్చి ఇచ్చారు. సరే వచ్చిన పని చెప్పాము. ఆయన విని ‘హైదరాబాదు వస్తున్నాను, అక్కడ కలవండ’ని చెప్పి పంపేశారు. .
.
అన్నట్టుగానే హైదరాబాద్ వచ్చిన శేషన్ మధ్యాన్నం విలేకరుల సమావేశం సంఘటన తరువాత ఆయన్ని కలుసుకోవడానికి కొంత సంకోచించాము . కానీ కలుసుకోమన్నది ఆయనే కావడంతో కాస్త ధైర్యం చేసి వెళ్ళాము.
అదేమిటో మంత్రం వేసినట్టు ఆయనలో ఢిల్లీలో కలిసినప్పుడు ఎలా వున్నారో ఇక్కడ అలా కనిపించారు.
అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అప్పటికే ఆ గదిలో ఉన్న వ్యక్తిని తనకు ఇంగ్లీష్ నేర్పిన గురువు అని పరిచయం చేశారు . ఆయన ఎవరో కాదు, KS అనే పొడి అక్షరాలతో హిందూ పత్రికలో వారం వారం ‘Know your English’ అనే కాలమ్ రాసే కే. సుబ్రహ్మణ్యం గారు.. మేము వచ్చిన పని చెప్పగానే ప్రెస్ క్లబ్ కార్యక్రమానికి రావడానికి సుముఖత వ్యక్తం చేశారు .
అయితే ఆ తరువాత సుప్రీం కోర్టు ఒక కేసు విషయంలో ఆయనకు సమన్లు జారీ చేయడంతో మొదలయిన చికాకుల నేపధ్యంలో శేషన్ క్లబ్ కార్యక్రమానికి రాలేదు , కానీ ఆయన వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకునే మహత్తర అవకాశం మాకు ఆ విధంగా లభించింది.. ఆ తరువాత ఎన్నికల కమీషనర్ గా శేషన్ ఏమిటో అందరికీ తెలుసు .
ఉన్నతమైన ఉద్యోగం చేసిన శేషన్, ముదిమి వయస్సులో వృద్ధాశ్రమంలో శేష జీవితం గడపాల్సి రావడం మాత్రం . అత్యన్త . విషాదం . (నిన్న శేషన్ రెండవ వర్ధంతి )
– భండారు శ్రీనివాస రావు