telugu navyamedia
ఆరోగ్యం

మాంసం ప్రియులకు హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది మాంసం ప్రియులే ఉన్నారు. ఆదివారం, పండుగల వేళ మాత్రమే కాదు.. సాధారణ రోజుల్లో కూడా చికెన్, మటన్ తినేవారు చాలా మంది ఉన్నారు. ఐతే మార్కెట్‌లో చికెన్, మటన్ కొనుగోలు చేసే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కోడి లేదా మేక మాంసం విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. కోసిన చాలా సేపటి తర్వాత కూర వండుకోవడం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఖచ్చితంగా వాటి నాణ్యతను పరిశీలించాలని సూచిస్తున్నారు. నేషనల్ మీట్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ సుఖ్‌దేవ్ బర్బుద్దే మాంసం నాణ్యతకు సంబంధించి ఓ ప్రముఖ వార్తా సంస్థతో కీలక విషయాలు పంచుకున్నారు. గొర్రె, మేక లేదా కోడిని కోసినప్పటి నుంచి మూడు గంటల్లోనే మాంసం వండాలని ఆయన స్పష్టం చేశారు.వాటిని కోసిన తర్వాత ఎక్కువసేపు బయట వాతావరణంలో ఉంచకూడదని. మాంసంపై బ్యాక్టీరియా పెరిగి కుళ్లిపోవడం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

అందుకే కోళ్లు, మేకలు, గొర్రెలను కోసిన మూడు గంటల్లోనే కూర చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ అలా కుదరని పరిస్థితుల్లో 0-4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఫ్రిజ్‌లో భద్రపరచాలి. కోసిన 24 గంటల తర్వాత వండుకోవాలనుకుంటే మాత్రం.. ఖచ్చితంగా మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. కానీ చికెన్, మటన్ దుకాణాల్లో తెల్లవారుజామున కోసి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గది ఉష్ణోగ్రత వద్దే పగలంతా అమ్ముతున్నారు. అలాంటి మాంసాన్ని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని సుఖ్‌దేవ్ బర్బుద్దే తెలిపారు. అందుకే మాంసం నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Related posts