telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : అలవోకగా గెలిచిన చెన్నై.. రేపే తుది పోరు.. ముంబై vs చెన్నై..

chennai vs mumbai ipl 2019 final decided

క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో భాగంగా విశాఖపట్టణంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన పోరులో చెన్నై అలవోక విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రేపు (ఆదివారం) ముంబైతో జరిగే ఫైనల్లో చెన్నై తాడోపేడో తేల్చుకోనుంది. సుదీర్ఘ కాలం తర్వాత తమకు దక్కిన సువర్ణావకాశాన్ని ఢిల్లీ చేజేతులా నాశనం చేసుకుంది. చెన్నై బౌలర్ల ముందు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ వికెట్లు సమర్పించుకున్నారు. ఫలితంగా ఢిల్లీ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. ఇక, ఫైనల్లోకి అడుగుపెట్టడం చెన్నైకి ఇది ఏకంగా ఎనిమిదోసారి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. కీలక మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీషా (5) శిఖర్ ధవన్ (18) సహా టాపార్డర్ మొత్తం చేతులెత్తేసింది. జట్టును ఆదుకుంటాడనుకున్న రిషభ్ పంత్ కూడా ఎటువంటి మెరుపులు లేకుండా 38 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఢిల్లీ ఆటగాళ్లలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారంటే ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. చెన్నై బౌలర్ల దెబ్బకు ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు ఫా డుప్లెసిస్ (50), షేన్ వాట్సన్ (50) ఇద్దరూ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై అలవోకగా విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు 20 పరుగులు చేశాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు చేసిన ఫా డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు లభించింది. ఈనెల 12 (ఆదివారం) జరిగే టైటిల్ పోరులో ముంబై ఇండియన్స్‌తో ధోనీ సేన తలపడనుంది.

ఐపీఎల్ ఫైనల్ : ముంబై vs చెన్నై రేపు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది.

Related posts