ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. దీంతో ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టాలని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో వరదలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యుత్, తాగు నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. పొలాల్లోకి వరదనీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, అరటి తోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయన్నారు.
విలీన మండలాల్లోని గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరు రోజులుగా 20 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. తమను ఆదుకోవాలంటూ ముంపు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు దేవీపట్నం మండలంలోని బాధితులను పునరావాస కేంద్రానికి తరలించారు. మరికొన్ని గ్రామాల ప్రజలు కొండలపైకి చేరుకున్నారు.