telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఐకానిక్ వంతెనకు చంద్రబాబు శంకుస్థాపన

Chandrababu Iconic Bridge Krishna River
విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూచిపూడి మన వారసత్వ సంపద అని, ఈ వంతెనకు కూచిపూడి ఐకానిక్ వంతెనగా నామకరణం చేస్తున్నామని అన్నారు.  ఈ వంతెనను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వస్తారన్నారు. నాయకత్వం సమర్థంగా ఉంటే జీవితకాలంలో ఏదైనా చేయవచ్చన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎన్టీఆర్ మహా నాయకుడయ్యారన్నారు. రాజధానిలో నిర్మాణాలు జరగడం లేదంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. 
రూ.1387 కోట్లతో 3.2కి.మీ.ల పొడవైన ఈ ఐకానిక్‌ వంతెనను నిర్మించనున్నారు. దీని మధ్యలో 0.48కి.మీ.ల భాగాన్ని ఐకానిక్‌గా నిర్మిస్తారు. ఈ భాగంలో యోగ భంగిమను పోలిన విధంగా పైలాన్‌ ఉంటుంది. దీనిని వంతెనతో అనుసంధానిస్తూ రెండు పక్కలా తీగల అమరిక ఉంటుంది. ఈ పైలాన్‌ ఎత్తు 170 మీటర్లు. ఆరు వరుసలుగా నిర్మిస్తారు. రెండు పక్కలా 2.5 మీటర్ల వెడల్పైన నడకదారి ఉంటుంది. నిర్మాణానికి పైల్‌ ఫౌండేషన్‌ వేస్తారు. ఈ వంతెనతో హైదరాబాద్‌, జగదల్‌పూర్‌ జాతీయ రహదారులు అమరావతితో అనుసంధానమవుతాయి.

Related posts