గ్రామ సంఘాల అకౌంటెంట్లను తొలగిస్తే ఉద్యమిస్తామని, విఓఎల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతోందని టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు అన్నారు. గ్రామీణ, పట్టణ సంఘాల వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. సమావేశాల నిర్వహణ, సమన్వయం చేసుకునేందుకు సహాయకులుగా వీరిని గ్రామసంఘాలు నియమించుకుంటే ప్రభుత్వం తొలగించడం చట్టవిరుద్ధమన్నారు. పరస్పర సహాయక సహకార చట్టం 1995 (మ్యాక్స్) చట్టం కింద రిజిస్టర్ కాబడిన గ్రామ, పట్టణ సంఘాల వ్యవహారాల్లో ఫ్రభుత్వ జోక్యమంటే ఎన్టీఆర్ తెచ్చిన చట్ట స్ఫూర్తికి తూట్లు పొడవటమే అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విఓఎల వేతనాన్ని పది వేలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత హామీని నెరవేర్చకుండా ఉద్యోగాల నుంచి తొలగించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర చేయడం అమానుషమన్నారు. ఆరు నెలలుగా జీతాలివ్వకుండా ప్రభుత్వం వారిని వేధిస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరిని తట్టుకోలేక, వైసిపి నాయకుల వేధింపులను ఎదుర్కోలేక విఓఎలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. విఓఎలపై వేధింపులను ఆపి ఉద్యోగభద్రత కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
జగన్ ఢిల్లీ పర్యటనపై యనమల విమర్శలు