చిత్తూరు జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. చంద్రబాబుతో సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు.నిన్న చంద్రగిరిలో ఏడు కేంద్రాల్లో జరిగిన రీపోలింగ్ టీడీపీకే అనుకూలంగా ఉందని నాని అధినేతకు తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఏప్రిల్ 11 నాటి కంటే ఎక్కువ పోలింగ్ నమోదయిందని చెప్పారు. ఈసారి చంద్రగిరిలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివర్తి నానిని ‘బాగా పనిచేశావ్.. శభాష్’ అంటూ చంద్రబాబు అభినందించారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని 7 కేంద్రాల్లో ఆదివారం రీ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రీపోలింగ్‌లో 89.29 శాతం పోలింగ్ నమోదైంది. పులివర్తివారిపల్లిలో 95.03 శాతం, వెంకట్రామాపురంలో 89.66 శాతం, కొత్తకండ్రిగలో 84.86, కమ్మపల్లిలో 83.56, ఎన్‌ఆర్ కమ్మపల్లిలో 88.83, కాలేపల్లిలో 94.64 శాతం, కుప్పంబాదూరులో 92.04 శాతం పోలింగ్ నమోదయింది. ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఏడు కేంద్రాల్లో సరాసరిన 90.42 శాతం పోలింగ్ నమోదైంది. అంటే గతం కంటే 1.13 శాతం స్వల్పంగానే తగ్గింది.
ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశాం: చంద్రబాబు