అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు నొక్కేస్తున్నారని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. 45 ఏళ్లవారికి పెన్షన్ ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నందుకు ముగ్గురు టీడీఎల్పీ నేతలను సస్పెండ్ చేశారని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ నిర్ణయంపై మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. బీసీ నేత అచ్చెన్నను సస్పెండ్ చేసి బీసీ బిల్లు పెట్టారని చంద్రబాబు అన్నారు.
తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సభను కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఎప్పుడో జరిగిపోయిన పుష్కరాల ఘటనపై నాపై నిందలు వేశారని చంద్రబాబు చెప్పారు. వైసీపీ సభ్యుల విమర్శలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శించారు. రైతులకు రూ.12500 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఇప్పుడు కేంద్రం సగం, రాష్ట్రం సగం ఇస్తుందని అంటున్నారని బాబు దుయ్యబట్టారు.