డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు. సోమవారం కలెక్టర్ ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు ప్రసంగించారు.
ఈ సందర్భంగా వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు.
అటవీ శాఖపై సమీక్ష సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు.
ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైదరాబాద్‌లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమందరం వనభోజనానికి వెళ్దామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.