ఒకే వేదికపై నారా చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతే కాదు..ఇద్దరూ పక్క..పక్కనే నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు. రాజకీయ విభేదాలు పక్కకు నెట్టి ఒకరినొకరు ఆత్మీయంగా మాట్లాడుకోవడం ఆకర్షణియంగా మారింది. చాలా కాలంగా మాటలు లేని దగ్గుబాటి, నారా కుటుంబాలు ఓ వేడుకలో కలిసి కనిపించారు.
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు కుమార్తె ఉమామహేశ్వరి కూతురు వివాహనిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో జరిగింది . ఈ వివాహ వేడుక పెళ్ళికుమార్తె ను చేసిన వేడుకలో ఎన్టీఆర్ కుటుంబం అంతా హాజరైంది. టీడీపీ అధినేత నారా కుటుంబ సభ్యులు మరియు దగ్గుపాటి కుటుంబ సభ్యులు హాజరైయ్యారు.
అయితే, దగ్గుబాటి-నారా కుటుంబాల మధ్య సఖ్యత ఉండదన్నది రాజకీయ వర్గాల మాట. నందమూరి కుటుంబలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు పెద్దిరికంగా నిలబడి అన్నీ తానై వ్యవహరించటం ఎప్పటి నుంచో ఉంది. అదే విధంగా దగ్గుబాటి దంపతులు బాధ్యతలు తీసుకుంటారు. పురంధేశ్వరి – భువనేశ్వరి ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యామిలీలో పెళ్లి సంబంధాల మొదలు..అన్నీ కార్యక్రమాలు దగ్గర నుంచి నిర్వహిస్తారు. దీంతో..ఇప్పుడు ఈ మూడు కుటుంబాలు వివాహం కోసం ఒకే చోటకు చేరారు.
1995లో ఎన్టీఆర్ ను పదవి కోల్పోవటం..చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయం లో నారా – దగ్గుబాటి కుటుంబాలు కలిసే ఉండేవి.ఆ ఘటన తరువాత దగ్గుబాటి – చంద్రబాబు మద్య విభేదాల కారణంగా వారు దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ లో చేరారు. వేంకటేశ్వర రావు ఎమ్మెల్యేగా.. పురంధేశ్వరి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మన్మోహన్ ప్రభుత్వంలో పురంధేశ్వరి మంత్రిగా పని చేసారు. రెండు విడతల్లోనూ మంత్రిగా అవకాశం దక్కింది. ఇక, ఆ తరువాత దగ్గుబాటి వేంకటేశ్వరరావు వైసీపీలో చేరినా.. కొంత కాలంగా దూరంగానే ఉంటున్నారు.
అయితే రాజకీయపరంగా పరస్పర విరుద్ధంగా కనిపించే చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించడం.. ఈ వేడుకలో ఆప్యాయంగా పలకరించుకోవం, అదే వేదిక మీద పురంధేశ్వరి- భువనేశ్వరి సైతం ఉన్నారు. ఇక, నందమూరి బాలకృష్ణ – నారా చంద్రబాబు- దగ్గుబాటి కుటుంబ సభ్యులు కలిసి గ్రూపు ఫొటోలు దిగారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో తోడల్లుళ్లు, అక్కాచెల్లెళ్లు కనిపించడంతో ఈ ఫోటోలను తెలుగు తమ్ముళ్లు ట్వీట్ చేసి.. రాజకీయం రాజకీయమే.. ఫ్యామిలీ.. ఫ్యామిలీనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుక ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో ఓ విశేషంగా మారగా.. రాజకీయంగానూ చర్చనీయాంశం గా మారబోతుంది.