ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సంతానం లేకపోవడం వల్లే ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటీరియల్ డిజైనర్‌గా పనిచేస్తున్న శిరిష్మకు ఓయూ కాలనీలోని ట్రయల్ విల్లాస్‌లో నివసించే గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016 డిసెంబర్‌లో వివాహం జరిగింది. ప్రస్తుతం వారిద్దరు గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్ సమీపంలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారు. వివాహమై నాలుగేళ్లయినా వీరికి సంతానం కాలేదు. దీంతో శిరిష్మ డిప్రెషన్‌కు గురైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన సిద్ధార్థ్… ఉరేసుకున్న శిరిష్మను చూసి… వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. మృతిరాలి తండ్రి చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.