telugu navyamedia
రాజకీయ

ఆల‌యాన్ని శుభ్రం చేసిన రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి.. ద్రౌపది ముర్ము నిరాడంబరత ఫిదా

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎన్డీయే తరఫున ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్‌, గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ప్రకటించారు.ముర్ముకు కేంద్రం.. జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది. ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌దికి బుధవారం నుంచి సీఆర్పీఎఫ్ ద‌ళాలు భద్రత ఇవ్వ‌నున్నాయి. 14-16 మంది పారామిలిటరీ సిబ్బంది ముర్ముకు సెక్యూరిటీగా ఉంటారని కేంద్రం తెలిపింది.

అంతేకాకుండా బుధవారం ఉదయం.. రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన తర్వాత శివాలయానికి వెళ్లిన ద్రౌపది ముర్ము.. స్వయంగా చీపురు పట్టి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఇప్పటికే అనేక పదవులు చేపట్టిన ఆమె.. ఆ హోదాల్నీ పక్కన పెట్టి, ఈ తరహాలో తన భక్తిభావాన్ని చాటుకోవడం విశేషం. ద్రౌపది ముర్ము చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా అవుతోంది. ద్రౌపది ముర్ముపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Droupadi Murmu

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామమైన బైదపోసిలో సంతాల్‌ గిరిజన తెగలో 1958 జూన్‌ 20న ద్రౌపది ముర్ము జన్మించారు.  

మారుమూల ప్రాంతంలో, పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేశారు. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కాలేజీలో ఆమె బీఏ చదివారు. ఇప్పుడది యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. తొలినాళ్లలో ఆమె టీచర్‌గా పని చేశారు. 1997లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

2015 మార్చి 6 నుంచి 2021 జూలై 12 వరకు ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఆమె పనిచేశారు. ఝార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌గా ఆమె నియమితులయ్యారు. పైగా దేశ చరిత్రలో ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తి ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన నేత ఆమె కావడం విశేషం.

ఒడిశాలోని రాయరంగాపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.2000 నుంచి 2004 మధ్య నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. 2007లో ఉత్తమ శాసన సభ్యురాలిగా  సేవలందించారు. 

ఎమ్మెల్యేగా, మంత్రిగా, గ‌వ‌ర్నర్‌గా కీల‌క ప‌ద‌వుల‌ను చేప‌ట్టిన ఆమె తాజాగా దేశ అత్యున్నత పీఠం రాష్ట్రప‌తి ప‌ద‌వి రేసులో నిలిచారు. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్​ జూలై 18న జరగనుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ముర్ము గెలిస్తే… ఆమె భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతితో పాటు దేశానికి రెండో మహిళా రాష్ట్రపతి అవుతారు.

Related posts