telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కనీసం రూ. 1000 కోట్లు కేంద్రాన్ని అడగాలని భావిస్తోన్న ఏపీ అధికారులు….

flood water reached kurnool transport issues

ఆంధ్ర ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చే నెల రెండో వారంలో రాష్ట్రానికి కేంద్ర బృందం రానుంది. నవంబర్ 9,10వ తేదీల్లో వరద నష్టం అంచనాపై రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనుంది కేంద్ర బృందం. వరదలు.. వర్షాల వల్ల జరిగిన పంట, ఆస్తి నష్టం అంచనాలను సిద్దం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఒకట్రొండు రోజుల్లో నష్టంపై తుది అంచనాలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు అధికారులు. వరదల వల్ల 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం వాటిల్లిందని అంచనా. సుమారు రూ. 10 వేల కోట్ల మేర పంట, ఆస్తి నష్టం జరిగింది అంటున్నారు అధికారులు.

రోడ్లు, వ్యవసాయం, ఆక్వా, ఉద్యాన పంటలు, విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్ వంటి శాఖలకు భారీగా నష్టం జరిగింది. ఆర్ అండ్ బీకి సుమారు రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు సమాచారం. సుమారు 3.41 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తెలుస్తుంది. రూ. 200 నుంచి 300 కోట్ల వరకు పంట నష్టం జరిగిందంటున్నారు అధికారులు. దాదాపు 2.40 లక్షల రైతులపై వరద ప్రభావం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగం దారుణంగా దెబ్బతింది. వరద నష్టం నివేదికను కేంద్ర బృందానికి అందజేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణ సాయం కింద కనీసం రూ. 1000 కోట్లు కేంద్రాన్ని అడగాలని భావిస్తోన్నారు అధికారులు. రోడ్ల మరమ్మత్తులు.. రైతుల ఇన్ పుట్ సబ్సిడీ నిమిత్తం అత్యవసరంగా రూ. 1000 కోట్లు అవసరమని అధికారుల అంచనా వేస్తున్నారు.

Related posts