కరోనా దెబ్బకు రాష్ట్రాలు అల్లాడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసింది. రాష్ట్రాలకు రూ. 15 వేల కోట్లతో అత్యవసర ప్యాకేజీని విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలతో కలిపి కరోనాపై పోరుకు కేంద్రం ఈ నిధులను ఖర్చు చేయనుంది. కరోనాను ఎదుర్కొనేందుకు పోరాడుతున్న జాతీయ, రాష్ట్ర స్థాయి ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రూ. 15 వేల కోట్ల నిధులను భారత ప్రభుత్వం కేటాయించింది.
ఈ నిధులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రూ. 15 వేల కోట్ల నిధులను మూడు దశల్లో ఖర్చు పెట్టనున్నారు. జనవరి 2020 నుంచి జూన్ 2020 వరకు మొదటి దశ, జులై 2020 నుంచి మార్చి 2021 వరకు రెండో దశ, ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2024 వరకు మూడో దశగా కేంద్రం నిర్ణయించింది. ఈ నిధులతో రాష్ట్రాలు పీపీఈ సూట్లు, వెంటిలేటర్లు, మాస్కులు, ఇతర పరికరాలు కొనుగోలు చేయవచ్చని, సామాజిక నిఘా వ్యవస్థలు, ఆసుపత్రుల అభివృద్ధి, అంబులెన్స్ ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.