telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చెరకు రైతులకు కేంద్రం శుభవార్త…

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ శివారు ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది.. 20 రోజులు గడిచినా ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు రైతులు.. పైగా.. వారికి మరింత మద్దతు పెరుగుతూనే ఉంది… రోజుకో తరహాలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఇది కేవలం చెరకు పండించి రైతులకు మాత్రమే శుభవార్త అని చెప్పాలి.. ఎందుకంటే.. పంచదార ఎగుమతులపై రాయితీకి కేంద్ర మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలిపింది. 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతులకు రూ.3,500 కోట్లు రాయితీ ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని.. కేంద్ర కేబినెట్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇక, ఈ రాయితీని నేరుగా రైతులకు చెల్లించనున్నట్టు వెల్లడించారు.. ఈ ఆర్థిక సంవత్సరం 2020-21కి వర్తింపజేయనున్నట్టు చెప్పుకొచ్చారు. 310 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి ఈ ఏడాది ఉంటుందనే అంచనాలు ఉండగా.. భారత్‌లో పంచదార డిమాండ్ 260 లక్షల టన్నులుగానే ఉందని.. మిగతాది ఎగుమతి చేస్తామన్నారు. దీంతో.. రైతులకు రూ.18 వేల కోట్ల వరకు ఆదాయం లభిస్తుందని కేంద్రం అంచనా వేసిందన్న ప్రకాశ్ జవదేకర్.. ఈ పథకం వల్ల 5 కోట్ల మంది రైతులు, 5 లక్షల మంది కూలీలు లబ్ధి చేకూరుతుందన్నారు. మరి దీని పై రైతులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.

Related posts