తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులికా సహా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జవాన్ల పార్థివదేహాలు వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నాయి. ప్రముఖుల నివాళుల తర్వాత కోయంబత్తూరు నుండి గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో ఢీల్లీకి తరలించనున్నారు.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి ముధలిక రావత్ భౌతికకాయాలను శుక్రవారం వారి నివాసానికి తరలించి.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికకు అంతిమయాత్రగా తీసుకువెళ్లి.. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పొగమంచు కారణంగా తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్ మధ్యలో నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ఘోర ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో సహ 11 మంది ఆర్మీ అధికారులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బిపిన్ రావత్ మృతితో యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించి అమరుడైన బిపిన్‌ను తలచుకుని దేశం మొత్తం విలపిస్తోంది.