టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారిపై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దళిత మహిళా ఎస్‌ఐని దూషించిన కేసులో ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్న “ఛలో ఆత్మకూరు” కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం నేత నన్నపనేని రాజకుమారి, స్థానిక ఎస్సై అనురాధ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
నన్నపనేని తనను కులం పేరుతో దూషించారనీ ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అని వ్యాఖ్యానించినట్లు ఎస్సై ఆరోపించారు. తాజాగా ఈ వ్యవహారంలో ఎస్సై ఫిర్యాదుతో నన్నపనేని రాజకుమారిపై ఐపీసీ సెక్షన్ 303, 506,509 r/w 34 కింద పోలీసులు కేసు నమోదుచేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ అనురాధతో పాటు సిబ్బందిపై అసభ్య పదజాల దూషణ, విధులకు ఆటంకం కలిగించినందుకు ఆమెతో పాటు టీడీపీ మహిళ నాయకురాలు సత్యవాణిలపై కేసు నమోదు చేశారు.