telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

టీడీపీ చరిత్రను.. బీజేపీ ముగించగలదా ?

chandrababu on modi tour in ap

గద్ద ముసలిది అయిపోయింది ! చూపు తగ్గిపోయింది. వేట సంగతి దేవుడెరుగు, అసలు తిండే చిక్కడం లేదు. తెచ్చి పెట్టే దిక్కు లేదు. అయ్యో అని దగ్గరకు తీసే నాథుడే కనిపించపోయె ! మేఘాలకి పైన ఎగురుతూ వర్షాన్ని కూడా గెలిచినట్టు కనిపించిన గద్ద ఇప్పుడు బిత్తర చూపులు చూస్తోంది. ఆకాశం నుంచి నేరుగా గురిపెట్టిన బాణంలా లక్ష్యం మీదకి దిగిన గద్దకి ఇప్పుడు దిక్కు తోచడం లేదు ! పైగా గద్ద వాలితే ఈసురోమన్నట్టుగా కనిపించసాగాయ్ పరిసరాలు. ఇలాంటి సమయంలో ఆ గద్ద కనిపించకుండా పోయింది. కొండ మూలల్లోకి, తనంతట తానుగా తనలోకి తాను జారుకుంది ! గద్దకు తన సమస్య ఏంటో తెలుసు. వయసు పెరుగుతున్న కొద్దీ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్న కొద్దీ తన బతుకు ఏమవుతుందో అర్థమైంది. అందుకే రిపేర్ మొదలు పెట్టింది. తనకి తాను చేసుకునే ప్రకృతి చికిత్స ఇది !

ముందుగా రాయికేసి ముగ్గును చెక్కుకోవడం మొదలు పెట్టింది. ఎందుకంటే సూదిలా ఉండే ముక్కు ఇపుడు మరీ పెరిగి వంకర తిరిగిపోయింది. అందుకే ఆహారం నోటికి చిక్కడం లేదు. ఏదీ పొట్టకి దక్కడం లేదు. పెరిగిన ముక్కు కొన చెక్కుకుంది. కొన్ని రోజులు చెక్కిన తర్వాత ముక్కు సూదంటుగా మారింది. ఆ సూదంటు ముక్కుతో ఇప్పుడు కాలి గోళ్లు తీసుకోవడం మొదలు పెట్టింది. గోళ్లు బాగా పెరిగిపోయాయ్. అవలీలగా ఆహారాన్ని చీల్చిన కాళ్లు కొన్నాళ్లుగా పని చేయడం లేదు ! అందుకే ఈ సూది ముక్కుతో ఆ గోళ్లు తీసుకుంది. తర్వాత, గోళ్లు తీసిన కాళ్లలో రెక్కలకి నగిషీలు పెట్టుకోవడం మొదలు పెట్టింది. గద్ద ఈ నాటిది కాదు. దాదాపు 30 ఏళ్లు దాటిపోయాయ్. అందుకే రెక్కలు కాదు ఈకలు పెరిగాయ్. అవసరమైన ఈకలు అవన్నీ ! రెక్కలకి లెక్కలేనంత భారం. బరువు పెరిగిపోయి ఎగరలేనంతగా తయారైంది అందుకే ! ఆ ఈకలన్నిటినీ క్రమంగా కాళ్లతో దూసేయడం మొదలు పెట్టింది. దూసింది. దూసింది. అనవసర ఈకలన్నీ పోయి బరువు తగ్గింది. ఒంట్లో నూతన ఉత్సాహం వచ్చింది. అయినా కంట్లో ఇంకా పదును పెరగలేదు. కళ్లకొచ్చిన పొరల్నీ కాళ్ల గోళ్లకో క్రమంగా తప్పిస్తూ సుప్త చేతనావస్థలో కొన్నాళ్లు అలా ఉండిపోయింది. ఇదంతా కొన్ని నెలల పాటు జరిగే ప్రకృతి చికిత్స. ! అన్నీ అయ్యాక ఓ రోజు నూతనోత్సాహంతో కీచ్ మని శబ్దం చేస్తూ ఆకాశంలో వేటకు బయల్దేరుతుంది అలనాటి రారాజు. ఇది పునర్జన్మ. ఓ ముప్ఫై ఏళ్లకి మూలన పడే పరిస్థితి వచ్చాక స్వ చికిత్సతో గద్ద తిరిగి పుంజుకుంటుంది ఇలా ! ఆ తర్వాత మరో 30 ఏళ్లకి కానీ దానికి మళ్లీ అలాంటి అవసరం పడదు. దీన్నే రిడప్షన్ అంటారు. ఆకాశం నుంచి మూలకి పడిన గద్ద – మళ్లీ పుంజుకొని నింగిని శాసించే చక్రం ఇది.

TDP Change Puthalapattu Candidateసరిగ్గా ఇప్పుడు చంద్రబాబు కూడా ఇలాంటి సంధి కాలంలోనే నిలిచాడు. కొన్నాళ్లుగా కనిపించడం లేదు. కనిపించడం తగ్గించి విశ్రాంతి తీసుకుంటున్న బాబు అక్కడితో ఆగిపోకూడదు. చికిత్స తీసుకోవాలి. తనని తాను తీర్చి దిద్దుకోవాలి. బ్లెస్సింగ్ ఇన్ డిజ్ గైజ్ అన్నట్టు, ఇలాంటి కలిసి రాని కాలంలోనూ కమలం ఓ రకంగా సాయమే చేస్తోంది చంద్రబాబుకి ! రెక్కల్లో లెక్క లేకుండా పెరిగిపోయిన ఈకల్ని బీజేపీ పెకలిస్తోంది. అలాంటి ఈకలు ఊడిపోతే, తోక నుంచి రాలిపోతే గద్దకి వచ్చేది ఉత్సాహమే తప్ప నష్టం కాదు. చంద్రబాబుతోపాటు టీడీపీ సానుభూతి పరులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది ! ఇక పెరిగిన గోళ్లను తీసుకోవడం, ముక్కుకు సాన పట్టి మళ్లీ పదును పెంచుకోవడం, అదును అందుకోవడం లాంటివి చంద్రబాబు వ్యూహాత్మకంగా వేయాల్సిన అడుగులే ! తనని తాను సరిదిద్దుకుంటూ పార్టీకి కొత్త నెత్తురు ఎక్కిస్తూ సమయానుకూలంగా మారుతూ లోటుపాట్లను పూడ్చుకుంటూ అడుగు వేస్తే , గరుడగా మారిన గద్దలా చంద్రబాబు కూడా ఛాంపియన్ గా అవతరించగలడు.

Related posts