telugu navyamedia
రాజకీయ వార్తలు

సీఏఏ పిటిషన్లపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

Supreme Court

పౌరసత్వ చట్టం (సీఏఏ) పై సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు దాఖలు కాగా, ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. సీఏఏపై ఇప్పట్లో ఎలాంటి స్టే ఇవ్వబోమని తెలిపింది. సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంపై అప్పటివరకు హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టవద్దని, ఉత్తర్వులు ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. సీఏఏపై దాఖలైన మొత్తం పిటిషన్లలో 60 పిటిషన్ల కాపీలు మాత్రమే తమకు అందాయని, తమ స్పందన తెలియజేసేందుకు గడువు కావాలని కేకే వేణుగోపాల్ కోరారు. అయితే, ఇదే సమయంలో సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కలగజేసుకుని సీఏఏకు సంబంధించిన అన్ని ప్రక్రియలను నిలిపివేయాలని కోరారు. సీఏఏపై వచ్చిన పిటిషన్లపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అంశంపై ఐదు వారాల తర్వాత విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.

Related posts