telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 లో ఆసీస్ ఆటగాళ్లు ఆడుతారా.. లేదా..?

india-australia first odi

ఐపీఎల్ 2021‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆసీస్ క్రికెటర్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఓ కండీషన్‌ మాత్రం పెట్టింది. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకి నిరభ్యంతర పత్రం జారీ చేస్తామని, అయితే టోర్నీకి ముందు క్రికెటర్ గాయాలు, ఫిట్‌నెస్‌ని సమీక్షించిన తర్వాతే ఎన్‌వోసీ ఇస్తామని తాజాగా సీఏ స్పష్టం చేసింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో చాలా మంది క్రికెటర్లు గాయపడగా.. కొందరు గాయాలతోనే మ్యాచ్‌లు ఆడారు. దీంతో గాయాల తీవ్రత మరింత పెరిగింది. అందుకే ఆటగాళ్ల విషయంలో సీఏ జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా వైరస్‌ భయంతో ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెలలో జరుగాల్సి ఉన్న దక్షిణాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకుంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం కంగారూ జట్టు వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితిలో అది అంత శ్రేయస్కరం కాదని భావించి వాయిదా వేసుకుంది. దాంతో ఐపీఎల్‌ 2021 సీజన్ కోసం భారత్‌కి ఆటగాళ్లని సీఏ అనుమతిస్తుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ తమకి ఐపీఎల్‌లో ఆడదానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఏ తెలిపింది.

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ ‌స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, జేమ్స్ పాటిన్‌స‌న్‌, నేథ‌న్ కూల్ట‌ర్ నైల్‌, అలెక్స్ కేరీ, ఆరోన్ ఫించ్‌ ఈసారి వేలంలో ఉన్న విషయం తెలిసిందే. ‌ముఖ్యంగా స్మిత్, మాక్స్‌వెల్, స్టార్క్, ఫించ్‌ భారీ ధర పలికే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ పాట్ కమిన్స్‌ని రూ. 15.5 కోట్లకి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈసారి స్టార్క్ ఆ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోసం ఫిబ్రవరి 18న చెన్నైలో బీసీసీఐ మినీ వేలాన్ని నిర్వహించనుంది. ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్‌పై బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది.

Related posts