అమెరికా ను ఇటీవల తుఫానులు ఊపిరిఆడకుండా చేస్తున్నాయి. వచ్చిన ప్రతిసారి భారీ నష్టాన్నే మిగిల్చి వెళ్తున్నాయి. తాజాగా, తీరం వైపు బ్యారీ తుపాను దూసుకువస్తోంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో సుడులు తిరుగుతున్న బ్యారీ మరికొన్ని గంటల్లో హరికేన్ గా బలపడుతుందని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ అంచనా వేసింది. లూసియానా రాష్ట్రం దిశగా పయనిస్తున్న బ్యారీ తీరం చేరితే 25 అంగుళాల మేర కుండపోత వర్షపాతం నమోదు కావొచ్చని భావిస్తున్నారు.
లూసియానాలోని పలు ప్రాంతాల్లో భారీస్థాయిలో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని సమీక్షించారు. లూసియానా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బ్యారీ ప్రభావం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.