telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక: బీజేపీ అభ్యర్థుల రేసులో కిలారి మనోహర్!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి అప్పుడే మొదలయ్యింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు ముందు జరగనున్న ఉపఎన్నిక కావడంతో, ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. గెలుపు సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తమ సర్వశక్తులూ ఒడ్డబోతున్నాయి.

బీజేపీలో కిలారి మనోహర్ పేరు ముందంజలో…

హైదరాబాద్‌లో బలపడేందుకు బీజేపీ గట్టిగా కృషిచేస్తున్న నేపథ్యంలో, జూబ్లీహిల్స్ వంటి కీలక నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను రంగంలోకి దించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది కాషాయ పార్టీ. ఈ నేపథ్యంలో, మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ పేరు బయటికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మనోహర్, తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి వెంగల్రావునగర్ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించారు.

అనంతరం బీజేపీలో చేరిన ఆయన, గత మున్సిపల్ ఎన్నికల్లో అదే స్థానానికి పోటీ చేశారు. కాలనీల్లో ఉన్న వ్యక్తిగత పరిచయాలు, పార్టీ స్థాయిలో అనుచరగణం ఉండటంతో పాటు, సెటిలర్స్ ఓట్లపై ప్రభావం చూపగలిగే నేతగా ఆయన పేరు వినిపిస్తోంది.

బీజేపీ వ్యూహాత్మక దృష్టి…

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ, సెటిలర్స్ ఓట్లు నిర్ణయాత్మకంగా మారుతున్నాయి.

ముఖ్యంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడం; మధురానగర్, వెంగల్రావునగర్, ఏజీ కాలనీ వంటి ప్రాంతాల్లో సెటిలర్ల ప్రభావం అధికంగా ఉండడం వల్ల, బీజేపీ ఈ వర్గాలపై దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో కిలారి మనోహర్ అభ్యర్థిత్వం బీజేపీ అధిష్టానానికి సరైన ఎంపికగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts