telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రేపటి నుండి.. మేడారానికి బస్సులు…

medaram jatara

నగరవాసులు మేడారం జాతర బాటపట్టారు. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర-2020కు పది రోజుల ముందు నుంచే నగరవాసులు పెద్దఎత్తున తరలుతున్నారు. రద్దీ లేని సమయంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. సెలవు దినాల్లో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ మీదుగా మేడారం వరకు వాహనాల రద్దీ పెరిగింది. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారానికి పెద్దఎత్తున భక్తులు తరలనుండడంతో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరంలోని పది ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గత నెల 26న 40 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రయోగాత్మకంగా నడిపారు. అదే అనుభవంతో ఆదివారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 500 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మేడారం సీట్ల బుకింగ్‌ ప్రక్రియను ప్రారంభించి 50 మంది ఒకేసారి బుక్‌ చేసుకుంటే వారికి అనువైన ప్రాంతానికి బస్సును పంపిస్తామని గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు ఆర్టీసీ 500 బస్సులను నగరం నుంచి నడపనుంది. షెడ్యూల్‌ బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులను వరంగల్‌ మీదుగా మేడారానికి నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాండ్‌లతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 500 బస్సులను నడపనున్నారు. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్‌, లింగంపల్లి, లాల్‌దర్వాజ తదితర ప్రాంతాల నుంచి బస్సులు మేడారానికి వెళ్ళేవిధంగా చర్యలు చేపట్టారు. నగరం నుంచి మేడారానికి బయలుదేరే ప్రతీ ఆర్టీసీ బస్సును ఉప్పల్‌లోని వరంగల్‌ పాయింట్‌ మీదుగా నడుపనున్నారు. అయితే ఆర్టీసీ బస్సులన్నింటినీ మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెల సమీపం వరకు నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులు ఆర్టీసీ బస్సుల్లో మెరుగైన ప్రయాణం చేయాలని గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు కోరారు.

Related posts