telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

అఖిలప్రియ పార్టీ మారనుందని టీడీపీ వర్గాల్లో చర్చ?

Minister Akhila Priya Sensational Comments
ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలలో చర్చ మొదలైనట్టు తెలుస్తోంది.
మంత్రిగా ఉండి కూడా తమ అనుచరులపై పోలీసుల దాడులను ఆపలేకపోయానని ఆమె మనస్థాపం చెందినట్టు తెలుస్తోంది.  సీఎం చంద్రబాబు పాల్గొన్న కర్నూలు జిల్లా జన్మభూమి కార్యక్రమానికి ఆమె హాజరు కాలేదు. ఈ విషయంలో ముందుగానే అనుమతి తీసుకున్నానని చెప్పినప్పటికీ, అధికార పార్టీ వర్గాల్లో మాత్రం ఆమె పార్టీ మారనుందన్న చర్చ ప్రారంభమైంది.
తన అనుచరుల పై  పోలీసు దాడులను నిరసిస్తూ ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తన గన్ మెన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. అఖిలప్రియతో పాటు సోదరుడు ఎమ్మెల్యే  భూమా బ్రహ్మాంనందరెడ్డి సైతం గన్ మెన్లను తిరస్కరించారు. ఈ పరిణామాలపై హోం మంత్రి చినరాజప్ప స్పందించారు. పార్టీలో  ఏమైనా సమస్యలు ఉంటే పెద్దల దృష్టికి తీసుకురావాలని అంతేకానీ ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదని ఆయన అఖిలప్రియకు సూచించారు.
 పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని దాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనని హోం మంత్రి హెచ్చరించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అఖిలప్రియ పార్టీ మారుతారన్న విషయం పై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలా? లేక జనసేన పార్టీలో చేరాలా? అన్న ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమె పార్టీ మారుతారనే విషయం మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రస్తావించలేదు.

Related posts