telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పశ్చిమబెంగాల్‌లో .. తీరం తాకిన బుల్‌బుల్ తుఫాను …

orange alert on bulbul cyclone

శనివారం అర్థరాత్రి బుల్‌బుల్ తుఫాను పశ్చిమబెంగాల్‌లోని సాగర్ దీవులు బంగ్లాదేశ్‌లోని ఖేపూపారా తీరాలను తాకింది. ప్రస్తుతం సుందర్‌బన్ డెల్టా ప్రాంతంకు ఈశాన్యం దిశగా పయనిస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. తీరం తాకిన సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 130 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌ వైపు కదులుతున్న క్రమంలో బుల్‌బుల్ తుఫాను బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో వెస్ట్ మరియు ఈస్ట్ మిద్నాపూర్‌లలో గాలులు గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచాయని ఇక నార్త్ 24 పరగానాస్‌ తీరంను అర్థరాత్రి తుఫాను తాకినట్లు వెదర్ డిపార్ట్ మెంట్ అంచనా వేస్తోంది. ఇక ఆదివారం రాత్రి సమయానికి వీచే గాలుల్లో కాస్త వేగం తగ్గి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుల్‌బుల్ తుఫాను ప్రభావంతో ఒడిషాలో ఒకరు వెస్ట్‌బెంగాల్‌లో ఒకరు మృతి చెందారు. తుఫాను ధాటికి బెంగాల్‌లో చెట్లు విరిగిపడ్డాయి.

కోల్‌కతాలో ఓ చెట్టు విరగి ఓ వ్యక్తి మీద పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం నుంచే కోల్‌కతాలో భారీ వర్షాలు పడటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తుఫాను పరిస్థితి పై సమీక్ష నిర్వహించారు.ఇక విపత్తు సమయంలో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా పాలనా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టిందని మమతా బెనర్జీ చెప్పారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆమె కోరారు. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని ఆమె ధైర్యం చెప్పారు. మరోవైపు ఒడిషాలో మరోవ్యక్తి మృతి చెందాడు. కేంద్రపార జిల్లాలో భారీ వర్షాలకు గోడ కూలడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒడిషా ప్రభుత్వం సమీక్షిస్తోందని అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఒడిషా చీఫ్ సెక్రటరీ అసిత్ త్రిపాఠీ చెప్పారు. ఇక అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర హోంశాఖ ఎయిర్‌ఫోర్స్, నేవీలను అలర్ట్ చేసింది. విశాఖపట్నంలో మూడు నేవీ షిప్‌లను సిద్ధంగా ఉంచింది.

Related posts