కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రధాని మోదీకీ తలొగ్గుతోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఈ రోజు ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే మోదీ, అమిత్‌షాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడడం ప్రమాదకరం అని అన్నారు.
బెంగాల్‌లో ఒక రోజు ముందు ఎన్నికల ప్రచారం నిలిపివేయాలన్న ఈసీ నిర్ణయం కూడా సరైంది కాదని దుయ్యబట్టారు. అక్కడి హింసాత్మక ఘటనలు దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తే ప్రధాని సభలు ప్రారంభానికి ముందే ప్రచారం నిలిపివేయాల్సిందన్నారు. ప్రధాని సభలు పూర్తయ్యాక ప్రచారం ముగిసిందని ప్రకటన చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి ఈసీ తలొగ్గినట్టు స్పష్టంవుతోందని అన్నారు.