telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

జంక్ ఫుడ్ ఇష్టమా.. అవయవాలు నాశనం అవుతున్నాయి.. జర భద్రం..

boy lost eyes on taking junk food

జంక్ ఫుడ్ తింటున్నవారు జాగ్రత్తగా ఉండకపోతే.. మీ కంటి చూపు, వినికిడి శక్తి మీ నుంచి దూరమవుతున్నట్లే. ఇది శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రస్తావిస్తున్న అంశం. యూకేలో ఓ టీనేజీ కుర్రాడు ఇంటి ఆహారంకు దూరమయ్యాడు. ప్రతి రోజూ జంక్ ఫుడ్ తీసుకునేవాడు. ఉదయం టిఫిన్‌ నుంచి మొదలు పెడితే రాత్రి భోజనం వరకు అతని కడుపులోకి పోయేదంతా జంక్‌ఫుడ్డే. అది కూడా ఎక్కువగా ఫ్రై ఐటెమ్స్, చిప్స్ మాత్రమే ఆహారంగా తీసుకుంటుండేవాడు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. క్రమంగా ఆ కుర్రాడు చూపును కోల్పోయాడు. ఇదేంటని వైద్యుల దగ్గరకు వెళితే అతను తీసుకున్న బలహీనమైన ఆహారం, లేక జంక్ ఫుడ్ అతని చూపును దెబ్బతీశాయని వైద్యులు చెప్పారు.

ఈ తరహా ఆహారంతో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఒబెసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని దీంతో పాటు శరీరంలోని నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని అనాల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. 14 ఏళ్ల వయస్సులో ఉన్న ఆ కుర్రాడు తనకు అలసట వస్తోందని చెబుతూ చికిత్స కోసం వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. ఆ కుర్రాడు జంక్‌ఫుడ్‌కు అలవాటు పడిపోయాడు. రక్త పరీక్షలు చేయగా అతనికి అనేమియా ఉన్నట్లు తేలింది. అంతేకాదు విటమిన్ B12 లోపంతో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక విటమిన్ బీ 12 కోసం ఇంజెక్షన్లు ఇచ్చారు. అంతేకాదు తన జీర్ణ వ్యవస్థ కోసం కూడా చికిత్స ఇచ్చారు. ఇక 15 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఆ కుర్రాడికి క్రమంగా వినికిడి శక్తి కూడా కోల్పోయాడు. అయితే ఎంఆర్ఐ మరియు కంటి పరీక్షలు నిర్వహించగా జబ్బు ఎలా తలెత్తిందో కనుక్కోలేకపోయారు.

ఆ తరువాత రెండేళ్లకు కుర్రాడి కంటిచూపు మరింత మందగించింది. అబ్బాయికి 17 ఏళ్లు వచ్చేసరికి అతని కంటి చూపు 20/200గా చూపించింది. అంటే అమెరికాలో ఈ స్థాయిలో చూపు పడిపోతే కంటిచూపు పూర్తిగా కోల్పోయినట్లే లెక్కిస్తారు. ఇది జరిగిన కొద్దీ కాలానికే అతని కళ్లను మెదడుకు అనుసంధానం చేసే నాడీ వ్యవస్థ దెబ్బతిని ఉండటం వైద్యులు గమనించారు. అదే సమయంలో విటమిన్ బీ 12, తక్కువ మోతాదులో కాపర్, సెలీనియం, విటమిన్ డీలు ఉండటాన్ని గమనించారు. ఇక అనుమానం వచ్చిన డాక్టర్లు కుర్రాడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడో ప్రశ్నించారు. దీంతో చూపు, వినికిడి శక్తి కోల్పోవడానికి కారణం అబ్బాయి తీసుకుంటున్న జంక్ ఫుడ్ కారణమని తేల్చేశారు. శరీరానికి విటమిన్ బీ 12 ఎంతో అవసరమని చెప్పిన వైద్యులు ఇదీ సరైన మోతాదులో లేకపోతే… శరీరంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని తద్వారా నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్యులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు . పోషకాహారలోపం కారణంగా చూపు కోల్పోయినట్లయితే… దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే నివారించొచ్చని చెప్పారు. ఈ కేసులో మాత్రం కుర్రాడి చూపు ఎందుకు కోల్పోయాడో అని తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. కళ్ల జోడు ఉపయోగించినప్పటికీ లాభం లేదని చెప్పిన వైద్యులు కుర్రాడి మెదడుకు కళ్లను అనుసంధానం చేసే నాడీ వ్యవస్థ దెబ్బతినిందని చెప్పారు.

Related posts