telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ బాలీవుడు నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

irfan-khan

ప్రముఖ బాలీవుడు నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బబిల్, అయాన్ ఉన్నారు. ఇర్ఫాన్‌ 2018లో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని 2019 సెప్టెంబర్‌లో ఇండియాకు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ముంబైలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం అకస్మాత్తుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. నిన్నటి నుంచి ఇర్ఫాన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, బుధవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించి మృతిచెందినట్టు ఇర్ఫాన్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. కాగా, ఇర్ఫాన్ మృతిపట్ల బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఇర్ఫాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ‘సలామ్ బాంబే’ సినిమాతో 1988లో ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‘పాన్ సింగ్ తోమార్’ సినిమాలో నటనకు గాను ఇర్ఫాన్ ఖాన్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ‘సైనికుడు’ సినిమాతో టాలీవుడ్‌‌కు కూడా పరిచయమయ్యారు. అయితే, తెలుగులో ఆయన చేసిన సినిమా ఇదొక్కటే. హిందీతో పాటు బ్రిటిష్, హాలీవుడ్ సినిమాల్లోనూ ఇర్ఫాన్ నటించారు. ‘స్లమ్‌డామ్ మిలియనీర్’, ‘ఇన్ఫెర్నో’, ‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Related posts