telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

36 ఏళ్ళకే అమెరికా కుట్రకు బలైపోయిన పాప్ స్టార్… : పూరి

Bob

తెలుగు ప్రఖ్యాత దర్శకుడు పూరీ జగన్నాథ్ గత కొంత కాలంగా మ్యూజింగ్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం ‘బాబ్‌ మార్లే’ గురించి మాట్లాడారు. “బాబ్‌ మార్లే.. ఫేమస్‌ ఐకాన్‌ ఆఫ్‌ పాప్‌ కల్చర్‌. అతి చిన్న వయసులోనే పాప్‌ స్టార్‌ అయిపోయాడు. అతని పాటలకు ప్రపంచం ఊగిపోయింది. తన పాటలతో ‘‘న్యాయం కోసం పోరాడండి’’ అంటూ లక్షల మంది ప్రజల్లో స్ఫూర్తి నింపడం మొదలుపెట్టాడు. చాలా మందికి అది నచ్చలేదు. ఒక రోజు కొంత మంది ఆయన ఇంటిపై తుపాకులతో దాడి చేశారు. అతడి భార్యను తలపై కాల్చారు. బాబ్‌ భుజంలోకి బుల్లెట్‌ దిగింది. అతడి మేనేజర్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. ఆ తర్వాత బాబ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు క్యాన్సర్‌ వచ్చి చనిపోయాడు. ఇది అందరికీ తెలిసిన కథ. కానీ ఎవరికీ తెలియని కథ వేరే ఉంది. అది ఈ మధ్యే బయట పడింది. వింటే షాక్‌ అవుతారు.

బిల్‌ ఆక్స్లే అనే వ్యక్తి 80 ఏళ్ల వయసులో చనిపోతూ.. డెత్‌ బెడ్‌పై ఉన్నప్పుడు ఈ రహస్యం బయటపెట్టాడు. అతడు అమెరికన్‌ సీఐఏ ఏజెంట్‌. అమెరికా ప్రభుత్వం బాబ్‌ వల్ల తమకు ప్రమాదం ఏర్పడుతుందని భావించింది. అతడిని చంపమని బిల్‌ని నియమించింది. బాబ్‌ మీద కాల్పులు జరిపింది అతడే. అయితే బాబ్‌ బతికి, దూరంగా వేరే చోటుకు వెళ్లిపోయాడు. దీంతో బిల్‌ అక్కడికి వెళ్లి, ఓ అభిమానిగా బాబ్‌ని కలిశాడు. నేను మీ అభిమానిని అని చెప్పాడు. షూ బహుమానంగా ఇచ్చాడు. తనే స్వయంగా బాబ్‌ కాళ్లకు తొడిగాడు. షూ వేసుకోగానే కుడివైపు కాలికి ఏదో గుచ్చుకుంది. బాబ్‌ బాధతో అరిచాడు. పొరపాటున ఏదో రాయి పడిందేమో అనుకున్నాడు. కానీ అది కంటికి కనిపించని చిన్న గుండుసూది. క్యాన్సర్‌ వైరస్‌ పూసిన గుండుసూది. ఆ క్షణమే బాబ్‌ జీవితంలో జరగకూడనిది జరిగిపోయింది.

ఆ సమయంలో బాబ్‌ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొన్నాళ్లకు అతడు చనిపోతాడని బిల్‌కు తెలుసు. బాబ్ మార్లే చనిపోయే వరకు అతడి వెంటే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఒక అభిమానిగా బాబ్‌తో ఉంటూ.. సేవలు చేసుకుంటూ, అతడికి మంచి స్నేహితుడైపోయాడు. మెల్లగా బాబ్‌ ఆరోగ్యం క్షీణిస్తుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. క్యాన్సర్‌ ఉందని డాక్టర్లు చెప్పడంతో బాబ్‌ షాకయ్యాడు. ‘సర్‌ మీకు మంచి చికిత్స ఇప్పిస్తాను. మీ లాంటి వాళ్లు బతకాలి. నాకు తెలిసిన వైద్యులు ఉన్నారు. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు, నేను చూసుకుంటాను’ అని బిల్‌ నమ్మించి ప్యారిస్‌ తీసుకెళ్లాడు. ప్యారిస్‌లో కొన్నాళ్లు చికిత్స చేశారు. అయినా ఫలితం లేదు. అక్కడి నుంచి లండన్‌ తీసుకెళ్లాడు. అక్కడ కూడా తగ్గలేదు. ఎందుకో తెలుసా.. బిల్ దగ్గరుండి బాబ్ మార్లేకు చికిత్స జరగకుండా చూస్తున్నాడు.

చివరిగా తనకు పూర్తి కంట్రోల్‌ ఉన్న దేశం అమెరికా తీసుకెళ్లాడు. ఓ ఆసుపత్రిలో ఉంచి, పూర్తిగా అతడికి చికిత్స జరగకుండా చూసుకున్నాడు. అతడి చేతుల్లోనే బాబ్‌ చివరి క్షణాలు గడిచాయి. చనిపోయే ముందు తన జీవితంలో బిల్‌ లాంటి స్నేహితుడు ఉన్నందుకు బాబ్ మార్లే ఎంతో ఆనందపడ్డాడు. చివరి వరకు నా వెంట ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కృతజ్ఞతాభావంతో బిల్‌ను చూస్తూ తుదిశ్వాస విడిచాడు. దేశం కోసం అతడిని చంపాడే తప్పా.. బిల్‌కు కూడా బాబ్‌ అంటే చాలా ఇష్టం. అప్పటి వరకు అతను సీఐఏ ఏజెంట్‌గా 17 మందిని చంపాడు. కానీ బాబ్‌ను నమ్మించి, మోసం చేయడాన్ని తట్టుకోలేక మనస్తాపంతో చావుబతుకుల మధ్య బెడ్‌పై ఆ నిజాన్ని ఒప్పుకుని, చనిపోయాడు. ఆ తర్వాత అమెరికా అతడు చెప్పేది తప్పని కొట్టిపడేసింది. ఇలాంటివన్నీ ఎప్పుడు రహస్యాలుగానే మిగిలిపోతాయి. ఏదేమైనా, బాబ్ మార్లే వంటి ఓ గొప్ప వ్యక్తి, సింగర్‌ మనకు దూరమైపోయాడు” అని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

Related posts