telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

కృత్రిమ చర్మంలో కూడా.. రక్తనాళాలట..

touch feel for artificial skin by swiss federation

వివిధ కారణాలతో చర్మాన్ని కోల్పోయిన వారు సహజంగా అనుకునే మాటలు.. అవసరమైనప్పుడు అవసరానికి తగినంత సజీవమైన చర్మం దొరికితే ఎలా ఉంటుంది? కాలిన గాయాల బారిన పడ్డవారికే కాదు, ఆసిడ్‌ దాడి బాధితులకు పెద్ద ఊరటగా ఉంటుంది. వారి చర్మం మళ్లీ మునిపటిలా మారిపోతుంది. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించే క్రమంలో న్యూయార్క్‌లోని రెనెస్సెలార్‌ పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు మరో కీలకమైన ముందడుగు వేశారు. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సాయంతో సజీవమైన చర్మాన్ని, అందులో రక్తనాళాలను కూడా ఏర్పాటు చేశారు. నిజానికి జీవకణాలతో తయారయ్యే చర్మం ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ఉపయోగం తాత్కాలికమే. పైగా రక్తనాళాలు లేని కారణంగా ఈ కృత్రిమ చర్మాన్ని ఎక్కువ కాలం వాడేందుకు అవకాశముండదు.

ఈ సమస్యను అధిగమించేందుకు రెనెస్సెలార్‌ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి విజయం సాధించారు. రెండు రకాల మానవ కణాలను కలపడం ద్వారా బయో ఇంక్‌ను సృష్టించిన శాస్త్రవేత్తలు వాటితో చర్మం లాంటి నిర్మాణాన్ని సిద్ధం చేశారు. యేల్‌ శాస్త్రవేత్తల సహకారంతో బయో ఇంక్‌కు కొన్ని కీలకమైన అంశాలను జోడించడంతో ఈ చర్మంలో రక్తనాళాలు పెరగడం మొదలైంది. ఎలుకల్లో గాయాలపై ఈ చర్మాన్ని ఉపయోగించినప్పుడు రక్తనాళాలు సహజసిద్ధ రక్తనాళాలతో కలసిపోవడం మొదలైందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న భారత సంతతి శాస్త్రవేత్త పంకజ్‌ కరాండే తెలిపారు.

Related posts