చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా మొదటి దశలో చూడని ఉత్పాతాలెన్నో రెండో దశలో వెలుగుచూస్తున్నాయి. గతంలో కంటే వ్యాధి వ్యాప్తి వేగం, తీవ్రత పెరిగాయి. చికిత్స విధానాల్లోనూ మార్పులు అనివార్యమయ్యాయి. కొవిడ్ చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా అణిచిపెట్టేందుకు ఇచ్చే స్టిరాయిడ్లు మోతాదు మించినా, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధ పడుతున్నా.. మరో ముప్పు పొంచి ఉంది. అదే మ్యుకర్‌మైకోసిస్! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు పోస్ట్ కొవిడ్ రోగుల్లో బయట పడుతున్న ఈ వ్యాధి ఆందోళన రేపుతోంది. ఫంగస్ శరీరంలోకి వ్యాపించిన రెండు మూడు రోజుల్లోనే ముఖభాగంలోనిఅవయవాలను కబళించేస్తుంది. తొలుత ముక్కులోపలి భాగంలో చేరి క్రమంగా కళ్లు, చెవులు, దవడలకు, తర్వాతి దశలో మెదడులోకి విస్తరిస్తుంది. నిల్వ ఉన్న బ్రెడ్డును ఫంగస్ తినేసినట్టే దాడిచేసిన చోటల్లా కణజాలాన్నీ ఈ ఫంగస్ తినేస్తుంది. అక్కడ గుల్ల చేస్తుంది. తర్వాతనల్లగా మారుస్తుంది. వ్యాధిని గుర్తించడం, చికిత్స అందించడంలో ఏమాత్రం తాత్సారం చేసిన ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది.