telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ నుంచి రాజాసింగ్‌‌ సస్పెన్షన్‌..10 రోజుల్లోగా స‌మాధానం ఇవ్వాల‌ని నోటీసులు

*బీజేపీ నుంచి రాజాసింగ్ స‌స్పెన్ష‌న్‌..
*పార్టీ లైన్‌కు విరుద్ధంగా రాజాసింగ్ వ్యాఖ్య‌లు
*రాజాసింగ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అధిష్ఠానం ఆగ్రహం

*పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయ‌కూడ‌దో
10 రోజుల్లోగా స‌మాధానం ఇవ్వాల‌ని నోటీసులు

బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్‌  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెషన్ వేటు పడింది. బీజేపీ క్రమ శిక్షణ సంఘం రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.

వివాదాస్పద వీడియో యూ ట్యూట్‌లో అప్‌లోడ్ చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అయితే ఆ వీడియోలో మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్‌ చేయటమే కాకుండా పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది.

అయితే వివరణ ఇచ్చుకోవడానికి రాజాసింగ్ కు పదిరోజులు సమయం ఇచ్చింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని కేంద్ర కమిటీ సూచించింది. సెప్టెంబర్ 2లోపు వివరణ ఇవ్వాలని తెలిపింది.

కాగా హైద‌రాబాద్‌లో మునావర్ ఫరూఖీ షో వద్దని చెప్పినా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడంపై సోషల్ మీడియాలో రాజాసింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపిస్తుంది.

మనోభావాలు దెబ్బతీశారంటూ సోమవారం నాడు రాత్రి నుండి మంగళవారం నాడు ఉదయం వరకు హైద‌రాబాద్‌లో సీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఉదయం రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై హైద్రాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై కూడా కేసు నమోదైంది. బీజేపీ శాసనసభపక్ష నేతగా కూడా రాజాసింగ్ కొనసాగుతున్నారు. ఈ సమయంలో రాజాసింగ్ పై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

 

Related posts